చట్టసవరణ చేస్తే జమిలి ఎన్నిలకు సిద్ధం
ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా
న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి):ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై చర్చించడానికి ఏవిూ లేదని, జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని ఆయన అన్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏమంటుందన్న ఆసక్తి చాలా మందిలో నెలకొన్నది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పందించారు. న్యూస్18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ కీలక అంశం గురించి మాట్లాడారు. తాము జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, చట్టంలో తగిన సవరణలు చేస్తే ఒకే దేశం, ఒకే ఎన్నిక నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని సునీల్ అరోరా అన్నారు. ఇక వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగే నాటికి డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు ఇచ్చే అంశంపై కూడా ఆయన స్పందించారు. ఇది ప్రతిపాదన దశలో లేదని అరోరా చెప్పారు. యువత, చదువుకున్న వారిని లక్ష్యంగా చేసుకొని తాము ఈ డిజిటల్ కార్డ్ సౌకర్యాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డుల్లో అవసరమైన సమాచారంతో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. అందరికీ ఈ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీనిని ప్రారంభించనున్నట్లు సునీల్ అరోరా తెలిపారు.