చిన్న కుటుంబంతోనే అభివృద్ధి

శ్రీకాకుళం, జూలై 10 : చిన్న కుటుంబాలతోనే పురోభివృద్ధి సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ శారద అన్నారు. ఆమె తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాబా దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 2011-12లో 22వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు లక్ష్యం కాగా 18,365 సాధించామని తెలిపారు. కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందన్నారు. ఈ కారణంగానే జిల్లాలో 2.5 ఉన్న జనాభా పునర్‌ ఉత్పత్తి రేటు ప్రస్తుతం 1.8కి దగ్గరైందన్నారు. దీనిని 1.5కి తగ్గించాల్సి ఉందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో అమ్మకొంగు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గర్భవతుల రిజిస్ట్రేషన్‌, వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత ప్రసవాలు, బాలింత సేవలు, పౌష్ఠికాహారం తదితర సేవలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె వెల్లడించారు.