చుక్కల మందుకు చక్కని స్పందన
కరీంనగర్, జనవరి 20 (): మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక హుస్సేన్ పురా అర్బన్ హెల్త్ సెంటర్ జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్, హెచ్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ప్రారంభించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశామని, 4,12,764 మంది 0-5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి అందరికీ పోలియో చుక్కలు వేయుటకు అంగన్‌వాడీ వర్కర్స్, టీచర్లు, ఆశా వర్కర్స్, స్వయం సహాయక బృందాలు మొత్తం 11,360 మంది సేవలు ఈ కార్యక్రమములో పూర్తిగా వినియోగించుకొని వంద శాతం విజయవంతం చేస్తామని అన్నారు. జిల్లాలో 2840 సెంటర్లు ఏర్పాటు చేసి జిల్లాలోని 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు అందేట్లు చేస్తామని అన్నారు. సెంటర్‌ల వద్దకు రాలేని వారికి ఏజెన్సి ప్రాంతాలు, క్వారీ వర్కర్స్, మురికి వాడ లు, వలస జీవులుండే ప్రదేశాలు, ఇటుక బట్టీల వద్ద పనిచేసే కుటుంబాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎక్కువ జనవాసాలు ఉండే చోట ప్రత్యేక దృష్టి పెట్టామని, 73 మొబైల్ టీమ్స్, 34 ట్రాన్స్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసామన్నారు.
శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం చింతకుంట గ్రామంలో ఇటుక బట్టీల వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నోడల్ అధికారిణి గాయత్రి, నగరపాలక సంస్థ కమిషనర్ ఆబిద్ హుస్సేన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అలీం, మాజీ డిప్యూటీ మేయర్ అబ్సాస్ తదితరులు పాల్గొన్నారు.