జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 23 (జనంసాక్షి) :
ఆగష్టు 25 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో నిర్దేశించిన ప్రతి ఒక్కరికి తప్పని సరిగా మాత్రలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3,22,000 వేల మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసున్న వారున్నారని వారందరికి నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు వేయాలని ఆదేశించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం, 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్ర పూర్తిగా వేయించాలని అన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను ప్రతీ ఒక్కరికి వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపివో లు పర్యవేక్షణ చేయాలని, మహిళా స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని తెలియజేశారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని సూచించారు. మాత్రను ఇచ్చే సమయంలో మంచినీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మాత్రలను ఇంటి బయటనే ఉండి పిల్లలకు వేయాలని, మాత్రలు వేసే సమయంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు వున్నాయా, లేవా అనే విషయాన్ని కనుక్కోవాలని, ఎవరికైనా దగ్గు, జ్వరము, శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది వున్నా, కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలకు మాత్రలు వేయవద్దని తెలిపారు. ఈ లక్షణాలున్న పిల్లల వివరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ మాత్ర వేసుకోవడం ద్వారా కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే చనిపోతాయని, పిల్లల ఎదుగుదలలో నులి పురుగుల ప్రభావం చాలా ఉంటుందని తెలిపారు. మాత్రలు వేయడం ద్వారా పిల్లలలో ఆకలి పెరగటం, రక్త హీనత నుండి విముక్తి, ఎత్తు, బరువు పెరగడం మొదలైన ప్రయోజనాలు ఉంటాయన్నారు.
ఈ నులిపురుగులు ఒకరి నుండి మరొకరికి కలుషిత మైన నీరు, ఆహారం, చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడం ద్వారా వ్యాపిస్తాయని, ప్రతి సంవత్సరం 2 దఫాలుగా ఆరు నెలల వ్యవధిలో ఈ టాబ్లెట్ ను పిల్లలకు ఇవ్వాలని కోరారు. గతంలో ఒకే ఒక రోజు ఈ కార్యక్రమం అన్ని స్కూల్స్ మరియు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించేవారని, కోవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం వారం రోజుల పాటు గృహ సందర్శన చేయడం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. మన భద్రాద్రి జిల్లాలో ఉన్న 3,22,000 మంది 1-19 వయసున్న పిల్లలందరికి ఈ మాత్రలు వేయాలని ఏ ఒక్కరినీ వడలదానికి అవకాశం లేదని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య, అంగన్వాడీ శాఖ నుండి క్షేత్ర స్థాయిలో ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని ఈ మాత్ర ఎంతో సురక్షితమైనదని, ఎటువంటి భయాలు లేకుండా తల్లి తండ్రులు వేయించాలని అన్నారు. ఏవైనా దుష్ప్రభావాలు కలిగినట్లయితే దగ్గర లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలని, డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్య పరమైన సందేహాలకు 1049ను , అంబులెన్స్ సేవలు కోసం 108 ను సంప్రదించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి శిరీష, ప్రోగ్రాం అధికారి నాగేందర్, డీపీఓ రమాకాంత్, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.