జైళ్లలో మతప్రచారం చేస్తున్నవారిపై కమిషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో అన్యమత ప్రచారం మత మార్పిడి చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప దీక్షలో ఉన్న తనను కొన్ని కారణాల వల్ల శాలిబండ పోలీసులు అరెస్టు చేశారని మోర్చా గ్రేటర్‌ ఉపాధ్యక్షుడు పొన్న వెంకటరమణ అన్నారు. అయితే తాను జైలులో ఉండగా ఒక పాస్టర్‌ అధికారిగా వచ్చి మత మార్పిడి  చేసుకొమ్మని ప్రలోభపెట్టారని వెంకటరమణ కమిషన్‌కు వివరించాడు. ఈ విజ్ఞప్తికి స్పందించిన కమిషన్‌ ఫిబ్రవరి 6లోగా నివేదిక అందించాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.