ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి

అత్మకూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్‌ పడడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వూరుగొండ శివారులోని వ్యవసాయ భూముల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్ధానిక హెడ్‌కానిస్టేబుల్‌ పోషయ్య, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… సీతారాంపురానికి చెందిన బాషబోయిన మహేందర్‌(27) వూరుగొండలోని మల్లాడి కృష్ణారెడ్డి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రరవారం ఈ గ్రామంలోని జన్ను బుచ్చికొంరయ్య వ్యవసాయ భూమిలో వరి నాట్లు వేయడానికి సిద్ధం చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తున్న క్రమంలో వెనుకనే ఉన్న బావి బొందలో ట్రాక్టర్‌ పడింది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనస్థలం వద్ద మృతుని భార్య హైమా కుటుంబ సభ్యులు చేసిన రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు  హెడ్‌ కానిస్టేబుల్‌ పోషయ్య తెలిపారు.