తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి
ఇప్పట్లో అఖిలపక్షం లేదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. తెలంగాణ సమస్య అధ్యయనానికి మరింత సమయం కావాలని ఆయన అన్నారు. తమ శాఖ నెలవారీ కార్యక్రమాల సమీక్ష వివరాలను ఆయన సోమవారంనాడు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణపై విలేకరులు ప్రశ్నించగా తెలంగాణపై ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని అన్నారు. హోమ్‌ మంత్రిగా ఇటీవలే తాను బాధ్యతలు స్వీకరించనని ఈ సమస్యను ఇంకా అధ్యయనం చేయవలసి ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ ఇచ్చినట్టయితే నక్సల్‌ సమస్య వస్తుందని చాలా మంది అంటున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిఉందన్నారు. చత్తీస్‌ఘడ్‌ ఏర్పడిన అనంతరం నక్సలైట్ల సమస్య పెరిగిందని షిండే ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో విభిన్న వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని అన్నారు. తెలంగాణ అంశం సున్నితమైనదే కాక సంక్షిష్టమైందని అందువల్ల అన్ని అంశాలు పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే నెల రోజుల్లో తెలంగాణ వస్తుందని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చేస్తున్న ప్రకటనల పట్ల షిండే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమాలలో ఉన్నవారు అలాగే చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. నెలరోజుల్లో తెలంగాణ వస్తుందని కెసిఆర్‌ ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవలేదని ఆయన అన్నారు.