తెలంగాణ గురించి చులకనగా మాట్లాడితే ఖబడ్దార్‌ : జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ వాదం గురించి, తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరినై చులకన చేస్తూ  మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వాదం, తెలంగాణ ప్రజల మనోభావాలను రాజగోపాల్‌ చులకనగా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక ముందు తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేవిధంగా మాట్లాడితే లగడపాటి భరతంపడతామని ఆయన హెచ్చరించారు. ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు కూడా సానుకూలంగా ఉన్నారనే తేలిపోయిందని, ఇక ఎంత మాత్రం జాప్యం చేయకుండా తెలంగాణ అంశాన్ని కేంద్రం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాజీనామా చేస్తేనే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దిగి వస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు.