దక్షిణ కాశీలో కమల వికాసం..
వేములవాడ నియోజకవర్గం లో బండికి 41,582 ఓట్ల ఆధిక్యం…
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 4 (జనంసాక్షి).
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ కి స్పష్టమైన మెజారిటీ లభించింది.రౌండ్ల వారిగా సంజయ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం భాజపా వైపు మొగ్గు చూపించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్, హుస్నాబాద్, హుజురాబాద్, వేములవాడ, సిరిసిల్ల,చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గలు ఉన్నాయి. భాజపా నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు,బిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ తో పాటు మరో 25 మంది ఇతర పార్టీ,స్వతంత్ర అభ్యర్థులు పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు.ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేతలు,నాయకులు పట్టణ, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2,26,249 మంది ఓటర్లు ఉండగా ఇందులో 208149 మంది పురుషులు, 118068 మంది మహిళా ఓటర్లు,32 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 1,68,356 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 74.43 శాతం ఓటింగ్ నమోదయింది.
సర్వశక్తులు వొట్టిన అభ్యర్థులు, నాయకులు…
పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులతో పాటు అభ్యర్థులు తమ సర్వశక్తులను ఓడ్డారు. బాజాపా అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఓటర్లను ఆకట్టుకున్నారు. బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సభలో ర్యాలీలో పాల్గొని ఓటర్ల మద్దతు కోరారు.
ప్రతి రౌండ్లో బండి ఆధిపత్యం..
పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుండి ఈవీఎంల లోని 19 రౌండులలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్ కు తన ఆదిత్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్ కి 81,714 ఓట్లు రాగా,బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 38142 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు 36022 ఓటు వచ్చాయి. వేములవాడ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ 41,582 ఓట్ల ఆదిక్యాన్ని సాధించారు.