దమ్ముంటే అదానీ స్కాంపై మాట్లాడండి

` జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుదురుగానీ..
` మీ గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు.
` బీజేపీ నేతలపై మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్‌ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ చేసిన కామెంట్స్‌పై మాత్రం ఉలిక్కి పడుతున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.అదానీ కుంభకోణం గురించి, హిండెన్‌ బర్గ్‌ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము లేదు. కానీ, బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ కామెంట్స్‌ చేయగానే.. వారి గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. వాళ్లది ఎంత దౌర్భాగ్యం..! వాళ్లు ఎంత బుద్ధి తక్కువ మనుషులు..!’ అంటూ మంత్రి ట్విటర్‌లో ఆశ్చర్యం వ్యక్తపర్చారు. అదేవిధంగా, ‘ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో చెప్పుకోండి..?’ అంటూ తన ట్విటర్‌ ఫాలోవర్‌లకు ప్రశ్న కూడా వేశారు. దానికి ‘ప్యాట్రియాటిజమ్‌ ఈజ్‌ ద లాస్ట్‌ రెఫుగీ ఆఫ్‌ ద స్కౌండ్రల్‌ (ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష)’ అన్న సామ్యేల్‌ జాన్సన్‌ సూక్తిని జతచేశారు.