దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి.
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు.
1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన  పేషంట్ అటెండర్ మరియు క్యాంటీన్.
90 లక్షల వ్యయంతో గంగోత్రి పాఠశాల సమీపంలో చేపట్టే సీసీ రోడ్డు.
రైతు బజారులో 4.50  కోట్ల వ్యయంతో చేపట్టే సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి శంకుస్థాపనలు.
రాష్ట్ర ఆర్థిక,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు.
తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)దసరా నుండి ఏఎన్ఎం ఉప కేంద్రాలను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పి.సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పి.మహేందర్ రెడ్డి, తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గావించారు.ఈ సందర్భంగా  స్థానిక నేషనల్ గార్డెన్ లో  నిర్వహించిన ఆశా సమ్మేళన  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.ఏఎన్ఎం, ఆశ వర్కర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక దశలో ప్రజల అనారోగ్య పరిస్థితిని గుర్తించి చికిత్స అందజేయాలని మంత్రి తెలిపారు.అదేవిధంగా ప్రజా ఆరోగ్య  పరిరక్షకులుగా, వారదులుగా ముందుండి పని చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ  ప్రభుత్వం చేయూత నిస్తుందని మంత్రి అన్నారు. కరోనా సమయంలో, వాక్సినేషన్ విషయంలో ఆశా వర్కర్లు,  వైద్య సిబ్బంది తోపాటు సీనియర్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని గుర్తు చేస్తూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది, సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని హంగులతో ఆసుపత్రుల భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా66 శాతానికి పెరిగిందని మంత్రి అన్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో 80 శాతము ప్రసవాల సంఖ్య పెరగడం అభినంద నీయమని మంత్రి అన్నారు.ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో కంటే ప్రభుత్వ హాస్పటల్లో  ప్రసవాల సంఖ్య పెరగడం దీనికి ఉదాహరణ అని మంత్రి తెలిపారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవ మరువలేనిదని, వారి సేవలు అభినందనీయమ ని మంత్రి అన్నారు. ఆశా వర్కర్లు విశేషమైన సేవలందిస్తూ అమ్మ పాత్రను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందించేందుకు  ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి  అన్నారు. కరోనా సమయంలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లుగా ప్రస్తుతం కూడా గ్రామాలలో ప్రతి ఇంటింటికి వెళ్లి బీపీ షుగర్  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సేవలు చేయడంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని ఆమె తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు వారి యొక్క బాగోగులు చూసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆమె తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం కాన్పులు కావడానికి ఆశా వర్కర్లు ఎంతో చొరవ చూపిస్తారని ఆమె అన్నారు. గతంలో తాండూరు జిల్లా ఆసుపత్రికి జెడ్పి నిధులనుండి కోటి రూపాయలు మంజూరి ఇచ్చి మరమ్మత్తు పనులు చేపించడం జరిగిందని, జిల్లా ఆస్పత్రి భవన అభివృద్ధికి నిధులు అవసరమైన మరికొన్ని నిధులు మంజూరు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ మంత్రిని కోరారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటి ,రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ముందుందని తెలుపుతూ విద్యా, వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా అభివృద్ధి దిశలో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాల మూలంగా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా
 ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహించబడుతున్నాయని ఆయన తెలిపారు.
       శాసనమండలి సభ్యులు పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని అదేవిధంగా ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని మంత్రిని కోరారు.
        శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ కు వైద్య కళాశాల మంజూరైనప్పటికీ వికారాబాద్ జిల్లా కేంద్రానికి తరలించినందున తాండూరుకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ పట్టణ ప్రధాన రోడ్డు పనులకు అవసరమైన కేటాయించాలని మంత్రిని కోరారు. తట్టేపల్లి పరిసర గిరిజన ప్రాంతాలకు అనువుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మాతా శిశు సంరక్షణ కేంద్రానికి అవసరమైన సదుపాయం కల్పించాలని ఆయన కోరారు.
   ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా తాండూర్ లో ఏఎన్ఎం,   ఆశా వర్కర్లకు అతిధుల చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు.
        మంత్రి పర్యటనలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన  పేషంట్ అటెండర్ మరియు క్యాంటీన్, 90 లక్షల వ్యయంతో గంగోత్రి పాఠశాల సమీపంలో చేపట్టే సీసీ రోడ్డు, రైతు బజారులో 4.50  కోట్ల వ్యయంతో చేపట్టే సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి శంకుస్థాపన గావించారు. అదేవిధంగా పాత తాండూరులో బస్తీ దవఖాన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాలకముందు  ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 108 జయంతి సందర్భంగా  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ , వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు