దేశమంతా మీతో ఉంది -ఈశాన్య ప్రజలకు పార్లమెంట్‌ అభయం

న్యూఢిల్లీ: దేశమంతా ఈశాన్య రాష్ట్ర వాసులకు మద్దతుగా ఉందని కేంద్రప్రభుత్వం వారికి అన్ని విధాలా సకరించేందుకు సిద్దంగా ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఇది మన దేశమని ఏ రాష్ట్రాన్ని అయినా వదిలివెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వెనక్కి వెళ్లిన వారు తిరిగి రావాలని కోరారు. పార్లమెంట్‌ ఉభయసభలూ ఈరోజు ముక్తకంఠంతో వారికి సంఘీభావం తెలిపాయి. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ వదంతుల వెనుక విదేశీహస్తం ఉందని ఆరోపించారు. వీటిని వ్యాపింపజేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని ఈశాన్య రాష్ట్రాలవారిని ఆయన కోరారు. సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా, భాజపా నేత సుష్మాస్వరాజ్‌, డీఎంకే నేత కనిమొళి, జేడీయూనేత శివానంద్‌ తివారి, ఆర్జేడి నేత లాలూప్రసాద్‌ యాదవ్‌, సీపిఎం నేతలు, ఎస్పీ తదితర పార్టీల నేతలంతా సంఘీభావం తెలిపారు.