నల్ల శ్రీనివాస్ తరహాలో ప్రతి ఒక్కరు ఆలయాల అభివృద్ధికి సహకరించాలి
– ఆదివరాహస్వామి భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మిస్తం – ఎండోమెంట్ సహకారంతో ఎంతో అభివృద్ది చెందుతోంది
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, కమాన్ పూర్ : ఆదివరహా స్వామి ఆలయ అభివృధ్ది గురించి ఆలోచన చేయడం గొప్ప విషయమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఆదివరహాస్వామి ఆలయంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవముల్లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు, భూపాలపల్లి జిల్లా యువ నాయకులు జక్కు రాకేష్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సుల్తానాబాద్‌కు చెందిన నల్ల లావణ్య శ్రీనివాస్ దంపతులు స్వామి వారి పాదాల చుట్టూ గ్రానైట్, స్టీల్‌తో ఏర్పాటు చేసిన రేలింగ్‌ను జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఆదివరహాస్వామి వారి పాదాలను రక్షించే విధంగా భక్తులకు గొప్పగా దర్శనం కల్పించేలా శ్రద్ద చూపి రేలింగ్ చేయించడం అభినంద నీయమన్నారు. ఆదివరహాస్వామి ఆలయం దినదినాభివృద్ది చెందుతోందని, గతంలో ప్రస్తుతం ఆలయ అభివృధ్దిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఆలయం ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆలయానికి పాలకవర్గం ఏర్పాటుచేయడం, ఈఓ నియామకంతో ఎంతో అభివృధ్ది చెందుతోందన్నారు. అలాగే పాలకవర్గ సభ్యులతో పాటు ఎంతో మంది భక్తులు తమవంతు సహకారం అందిస్తూ అభివృద్దికి బాటలు వేస్తూ తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. అదే విధంగా స్వామి వారికి తమ వంతు సేవ చేయాలని ఆలోచనతో రేలింగ్ ఏర్పాటు చేసిన నల్ల లావణ్య, శ్రీనివాస్ దంపతులతో పాటు ఆయన కుటుంబసభ్యులను జెడ్పీ చైర్మన్ అభినందించారు. నల్ల శ్రీనివాస్ దంపతుల తరహాలోనే ప్రతి ఒక్కరు ఆలయ అభివృద్దికి సహకారం అందించాలని, ఆలయ అభివృద్దితోనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని గమనించాలని ఆయన అన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని, ఈ క్రమంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని,రాబోయే ఉగాదికి భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకునేలా రహాదారి ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం స్వామివారి ఆలయ ఆవరణలో ఆదివరహస్వామి ఎలక్ట్రిషన్ వర్కర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు.