నా బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు – ఆనందం వ్యక్తం చేసిన చిన్నారి

 తల్లి జనంసాక్షి, ముత్తారం : పుట్టుకతోనే వినికిడిలోపంతో బాధపడుతున్న నా బిడ్డ బాధను చెప్పితే బాగు చేయిస్తానంటూ జడ్పీ ఛైర్మన్ పుట్ట మధన్న భరోసా ఇచ్చాడంటూ ముత్తారం మండలం మైదబండకు చెందిన మంథని హృతిక తల్లి ఆనందం వ్యక్తం చేసింది.ముత్తారం మండలం మైదబండ కు చెందిన మంథని శ్రీనివాస్‌ ఐదేండ్ల కూతురు హృతిక పుట్టుక తోనే చెవుడు, వినికిడి లోపంతో బాధపడుతోంది. పనిచేసుకుంటేనే పూట గడిచే శ్రీనివాస్‌ తన కూతురుకు మెరుగైన వైద్యం అందించి బాగు చేయించు కోవాలని తపన పడ్డాడు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్నా తన కూతురు కోసం అప్పు చేసైనా బాగు చేయించుకోవాలని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, హన్మకొండ లాంటి ప్రాంతాల్లోని అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. ఆయా ఆస్పత్రుల్లో హృతికకు పరీక్షలు చేసి లక్షల్లో ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. లక్షలు వెచ్చించే స్థోమత లేని శ్రీనివాస్‌ దిక్కుతోచని స్థితిలో తన భర్త కుమిలిపోయాడని తెలిపారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ముత్తారం మండల పీఏసీఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డిని కలిసి తన కూతురు పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితిని వివరించి తన గోడును వెల్లబోసుకోగా తమ పరిస్థితిని జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధన్నకు చెప్పి మమ్మల్ని కలిపించారని చెప్పింది. తమ బిడ్డ పరిస్థితిని, తమ ఆర్థిక స్థితిగతులను జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకు చెప్పడంతో వెంటనే స్పందించి హృతికకు మంచి వైద్యం అందించి బాగు చేయిస్తానన్నాడని ఆమె తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఈఎన్‌టీ ఆస్పత్రిలో తమ బిడ్డను స్వయంగా వచ్చి వైద్యులకు చూపించారని తెలిపారు. హృతికకు మూడు మాసాల పాటు స్వీచ్‌థెరపీ అవసరమని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే వసతి కల్పించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు తమకు రూపాయి ఖర్చు కాకుండా వైద్యం అందించేలా చూస్తున్నారని ఆమె తెలిపారు. హృతికకు నయం అయ్యే వరకు చికిత్స అందించేలా చూస్తానని ధైర్యం చెప్పారన్నారు. ఆనాటి నుంచి వైద్య చికిత్స అందిస్తుండటంతో హృతికలో కొంత మార్పు కనబడుతోందని, తన బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు పుట్ట మధు అని ఆమె కొనియాడారు. తమలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తున్న పుట్ట మధు అందరికి దేవుడులాంటి నాయకుడని, అలాంటి నాయకుడుంటే మాలాంటి పేదోళ్లకు ఎంతో గుండె ధైర్యం ఉంటుందంటూ ఆమె ఆనందబాష్పాలతో చెప్పారు.