నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం
న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచే ఈ పద్ధతి న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తోందని పేర్కొంది.’’విచారణ పూర్తయ్యేంతవరకు నిందితులను అరెస్టు చేయకూడదనేది డీఫాల్ట్‌ బెయిల్‌ ముఖ్య ఉద్దేశం. దర్యాప్తు పూర్తయ్యేవరకు విచారణ చేయొద్దని విూరు చెప్పలేరు. అరెస్టు కూడా చేయడానికి వీలులేదు. అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేస్తూ.. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచలేరు’’ అని ఈడీ తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజుకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సూచించింది.ఈ కేసులో ఓ వ్యక్తి 18 నెలలపాటు జైల్లోనే ఉన్నాడని, ఇది తమనెంతో ఇబ్బందికి గురిచేస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్టు చేసినప్పుడే విచారణ మొదలు కావాలని స్పష్టం చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఇలాంటి అభిప్రాయాన్ని గతంలోనూ వ్యక్తంచేసింది. దర్యాప్తు పూర్తిచేయకుండా, నిందితుడికి డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరించే ఉద్దేశంతో వరుస ఛార్జిషీట్‌లు దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇదిలాఉంటే, సీఆర్‌పీసీ ప్రకారం, నిర్దేశించిన గడవులోగా అధికారులు దర్యాప్తు పూర్తి చేయకపోయినా, లేదా తుది ఛార్జిషీటు దాఖలు చేయని పక్షంలో అరెస్టైన వ్యక్తి డీఫాల్ట్‌ బెయిల్‌ పొందేందుకు అర్హుడు.