నియోజకవర్గాల్లో పర్యటించండి..మేళ్లు వివరించండి

నేతలకు దిశానిర్దేశం చేసిన ములాయం
లక్నో, జూలై 10 : సార్వత్రిక ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ తహతహలాడుతోన్న సంకేతాలు కనపడుతున్నాయి. 2013లో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావొచ్చని, అందుకు అంతా సిద్ధంగా ఉండాలని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ములాయం ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ మేరకు పార్టీ శ్రేణులను సమాయత్త పరిచినట్టు ఆ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలు ఏ సమయంలోనైనా రావచ్చు.. అందుకు అంతా సిద్ధంగా ఉండాలి.. ఈసారి ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంటు స్థానాలను చేజిక్కించుకోవాలి. అదే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా పనిచేయాలని ములాయం పిలుపునిచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కోరారు. అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలో ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రజలకు వివరించాలని, ఆయా నియోజకవర్గాలకు తరలివెళ్లి ఈ కార్య క్రమంలో నిమగ్నమవ్వాలని ఆయన సూచించారు. గత ఎన్నికల్లో తాము ఓడిపోయిన 58 నియోజకవర్గాలకు 58 పరిశీలకులను నియమించారు. ప్రస్తుతం ఉన్న 22 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గాల్లో కూడా ఈ పరిశీలకులు విస్తృతంగా పర్యటించి అక్కడి వారి అనుచరులతో స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల నాటికి మంచి ఫలితాలు రాబట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు గాని, మంత్రులకు గాని టిక్కెట్లు ఇచ్చేది లేదని, నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం పరిశీలకుల నియామకం, రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను పరిశీలించి జులై 30వ తేదీ నాటికి సవివరమైన నివేదికను పార్టీ కేంద్ర నాయకత్వానికి అందించాలని కూడా నిర్ణయించారు.