నిర్వీరామంగా సంగీత, నృత్య యజ్ఞం ప్రారంభం

విజయనగరం, జూన్‌ 24 : సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు తొమ్మిది మంది నృత్య కళాకారులు, 13 మంది సంగీత కళాకారుల నిర్వీరామ నృత్య, సంగీత యజ్ఞం కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. స్థానిక వరలక్ష్మి త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు 120 గీతాలను సంగీత కళాకారులు ఆలపిస్తారు. వీటికి నృత్య కళాకారులు అభినయం చేస్తారు. ఉదయం ఈ పోటీలను శంకర్‌మఠ్‌ అధ్యక్షుడు బుచ్చిబాబు ప్రారంభించారు. సాహితీ వేత్తలు డాక్టర్‌ ఎ. గోపాలరావు, ఏవీఎన్‌ మూర్తి, సిటీ కేబుల్‌ డైరెక్టర్‌ మేక కాశీ విశ్వేశ్వరుడు ప్రారంభించారు. సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీరాందాస్‌, కార్యదర్శి హిమబిందు పర్యవేక్షణలో నృత్య కళాకారులు ప్రసన్న, శ్రీవల్లి, రోజా, నవ్య, సాక్షి, వల్లిశ్రీ, ప్రియాంక, ప్రవీణ్‌, మేఘన అభినయం చేస్తుండగా, వీటిని కల్పన, రమణ, బాబుల్‌ మాస్టారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సంగీత విభాగంలో రమణి, ఇందిర, స్వర్ణ, లిఖిత, మౌనిక, లక్ష్మీప్రసన్న, వాత్సల్య, రిఖిత, లక్ష్మీప్రియ, గాయత్రి, సాయికీర్తి, అభినవ్‌, ప్రశాంతి గాత్రాలను అందిస్తుండగా మృదంగంపై శివకుమార్‌, శ్రీనివాస్‌ శర్మ, వయోలిన్‌పై ఈశ్వర్‌రావు, తబలపై పవన్‌కుమార్‌ సహకరిస్తున్నారు. వీటికి ఎవిఎన్‌ మూర్తి, సీహెచ్‌ విద్యాసాగర్‌ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేసేందుకు వారి ప్రతినిధులు విచ్చేశారని తెలిపారు.