నిస్సహాయులకు చేయూతనివ్వాలి

ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యావత్‌ జాతిమొత్తం ఈ దుర్మార్గాన్ని ముక్తకంఠంతో ఖండించింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో ఆమె బతకాలని కోరుతూ భారతీయులంతా ఆమె కోసం ప్రార్థించారు. దుండగులు అమానవీయంగా ప్రవర్తించడంతో వైద్యులు ఎంతగా కష్టపడినా ఆమె బతకలేదు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి నుంచి సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృత్యు ఒడికి చేరింది. అయినా ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు, ఆ ఘాతుకానికి సంబంధించిన చేదు నిజాలు ఎవరినీ వీడటం లేదు. ఇటీవల ఆమె స్నేహితుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఆ రోజు రాత్రి రోడ్డుపై నిస్సహాయస్థితిలో పడి ఉన్న తమను ఎవరూ పట్టించుకోలేదని, పోలీసులు కూడా ఘటన స్థలం ఏ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వస్తుందంటూ చర్చించున్నారే తప్ప సాయం చేసేందుకు, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చొరవ చూపలేదని తెలిపాడు. వారి చర్చతో రెండు గంటలు వృథా అయ్యాయని, కీలకమైన ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్తే తన స్నేహితురాలు బతికేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ఆమె బతకాలని కోరుకుంది. అందుకోసం ప్రార్థనలు చేసింది. మరణానంతరం కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. నిర్భయ లాంటి నిస్సహాయులు మన మధ్య.. మన చుట్టు పక్కల కనిపిస్తూనే ఉంటారు. ఆ రోజు రాత్రి ఢిల్లీలో ప్రజలు మనకెందుకులే అన్నట్లుగానే మనమూ మనకెందుకులే అనుకుని పక్కకు తప్పుకుపోతాం. రేపు పోలీసులు పిలుస్తారు.. ఇంటికి వాళ్లొస్తారు.. వీళ్లొస్తారు.. అంటూ భయపడిపోయి ఎవరిదారిన వాళ్లు పోతారు. అదే పరిస్థితి మన అక్కకో, చెల్లికో, అన్నకో, తమ్ముడికో జరిగితే అలాగే చూస్తూ వెళ్లిపోతామా? మనకెందుకులే అని పక్కకు తప్పుకుంటామా? ఎవరెలా చస్తే మాకేంటని అనుకుంటామా? ఒక్కరమే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోతే చుట్టు పక్కల ఎవరున్నారో చూసి బిగ్గరగా పిలుస్తాం. వారిసాయంతో ఆస్పత్రికి తీసుకెళ్తాం. డాక్టర్లను, కనిపించిన ఆస్పత్రి సిబ్బందిని విసిగించి మరీ క్షేమ సమాచారం మాటిమాటికి అడిగి తెలుసుకుంటాం. మనవారైతే ఒకలా.. ముక్కూముఖం తెలియని వారైతే మరోలా స్పందిస్తాం. ఈ విషయంలో వందకు తొంభైతొమ్మిది మంది వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు మాత్రమే మానవతా హృదయంతో స్పందిస్తారు. సమస్త భారతీయులంతా తమవారే, తమ కుటుంబ సభ్యులేనని అనుకుంటారు. అనుకోవడమే కాదు అలాగే స్పందిస్తారు. సంఘటన జరిగి, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత నింపాదిగా అయ్యో అని ఓ నిట్టూర్పు విడుస్తాం. పాపం అంటూ జాలి చూపుతాం. కానీ నిస్సహాయ స్థితిలో రోడ్డు పక్కన పడిఉన్న అభాగ్యులను అప్పుడే పట్టించుకుని కాస్తంత మానవతా దృక్పథంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ఉంటే ఆ కుటుంబంలో ప్రసరించే నూతన వెలుగు మనమే ఆవుతాం. ఆ అభాగ్యుడి చావు వల్ల వారి కుటుంబంలోకి వచ్చి చీకటికి మనదే బాధ్యత. వారి కుటుంబం అస్తవ్యస్తమై పిల్లలకు సరైన చదువు లేక రోడ్డున పడితే అందుకు మనమే వందశాతమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు ఏదైన జరిగి మనకీ అలాంటి పరిస్థితే దాపురిస్తే.. ఆలోచించుకోవడానికి ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ.. చ..చ మనమేంటి మనకు అలాంటి గతి పట్టడమేంటి అని ఎవరైనా అనుకుంటే వారిని మించిన అవివేకులుండరు. ప్రతి మనిషి జీవన గమనంలో ముందుకు వెళ్లేందుకు నిత్యం రోడ్డుపైకి రాక తప్పదు. మనమెంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారు మనలాగే ఉండాలని లేదు. మనమే తప్పు చేయకున్నా ఇతరులూ తప్పు చేయకుండా ఉండరు. ఎవరో చేసిన తప్పుకు మనం బలవుతాం. అప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోకుండా వెళ్తే.. ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదూ. ఇలాంటి పరిస్థితే ప్రతి ఒక్కరిది. అందుకే అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం.. అత్యావసర పరిస్థితుల్లో నిస్సహాయులకు చేయూతనిద్దాం. స్పందించాల్సిన సమయంలో స్పందించి మనలో మానవత్వముందని.. మనుషులమని నిరూపించుకుందాం.