నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): కనీసం 15 రోజుల పాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండు చేశారు. ఆదివారం ఉదయం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చాంబర్‌లో బిఎసి సమావేశం జరిగింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అజెండా రూపొందించుకునేందుకుగాను స్పీకర్‌ అధ్యక్షతన బిఎసి (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం జరిగింది. సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ, సీపిఐ, సిపిఎం, ఎంఐఎం, వైఎస్‌ఆర్‌సిపి, లోక్‌సత్తా పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, అశోకగజపతిరాజు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం రాంనారాయణరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ, ఉప సభాపతి భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ సిపి తరఫున వైఎస్‌ విజయమ్మ, శోభానాగిరెడ్డి, లోక్‌సత్తా తరఫున జయప్రకాశ్‌ నారాయణ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ, సిపిఐ తరఫున జి.మల్లేష్‌, సిపిఎం తరఫున రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బిఎసి సమావేశానికి హాజరు కాలేదు.
ఐదు రోజుల పాటు..
బిఎసి సమావేశం ముగిసింది. ఐదు రోజుల పాటు శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీ వినాయకచవితి కావడంతో సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఫీజు రియంబర్స్‌మెంటు, విద్యుత్‌ సమస్య, రైతుల సమస్యలు, కరువు పరిస్థితులపై సభలో చర్చించనున్నారు.
టీడీపీ వాకౌట్‌
అయిదు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరగనుండడంపై నిరసన తెలుపుతూ బిఎసి నుంచి టీడీపీ వాకౌట్‌ చేసింది. అందులో ఒకరోజు సెలవు దినం కాగా.. నాలుగు రోజుల పాటు మాత్రమే జరగనుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటికి బిఎసి ముగియడంతో అందరూ వెలుపలకు వచ్చారు. ఆ పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వివరాలిలా ఉన్నాయి.
20 అంశాలపై 20 రోజుల పాటు..
టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ 20 అంశాలపై 20 రోజుల పాటు చర్చించాలని బిఎసిలో స్పీకర్‌ను కోరామన్నారు. అయితే అయిదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. వర్షాకాల సమావేశాలను మొక్కుబడిగా నిర్వహించి ప్రభుత్వం పారిపోయేందుకు యత్నిస్తోందన్నారు. విద్యుత్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌, కరువు, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ తదితర విషయాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం తప్పించుకునేందుకు సభా పనిదినాలను కుదిస్తోందన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభా సమావేశాల పనిదినాలు తగ్గుతుండడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కు వివరించామని, సమావేశాల దినాలు పెంచాలని కోరామని, తప్పకుండా పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. తాజా సమావేశాలు అయిదు రోజులేననడంతో ఆ హామీని తుంగలో తొక్కినట్టయిందన్నారు. 2010లో 43 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశమైంది. 2011లో 36 దినాలు.. 2012లో ఇప్పటికే 30 రోజులు జరగ్గా.. తాజా సమావేశాలతో కలుపుకుని వాటి సంఖ్య 34కు చేరుతుందన్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాల పనిదినాలను కుదించడం వల్ల ప్రజల సమస్యలు చర్చకు రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కనీసం 15 రోజులైనా నిర్వహించాలని డిమాండు చేస్తున్నామని అన్నారు. కళంకిత మంత్రులపై తమ పార్టీ వైఖరి మారదన్నారు. అవినీతి మంత్రులపై ముఖ్యమంత్రి కిరణ్‌ తన వైఖరిని తెలియజేయాలని కోరారు. ధర్మాన రాజీనామాను ఎందుకు పెండింగ్‌లో పెట్టారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సిఎంపై ఉన్నదన్నారు. ఎక్కువ రోజులు సమావేశాలు జరిగితే అన్ని విషయాలు ప్రజలకు తెలిసిపోతాయన్న ఉద్దేశంతోనే వర్షాకాల సమావేశాల దినాలను కుదించారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో కలవబోము : విజయమ్మ
ప్రజలు తమ పక్షాన ఉన్నారని.. అలాంటప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కలవాల్సిన పనిలేదని, కాంగ్రెస్‌లో ఎట్టి పరిస్థితిలోను తమ పార్టీ విలీనం కాబోదని వైఎస్‌ఆర్‌ సిపి గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. బిఎసి ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి ఏ పార్టీతోను మాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకోవాల్సిన అగత్యం లేదన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అన్ని సీట్లు గెలిపించారు. భారీ మెజారిటీని ఇచ్చారు. అలాంటప్పుడు తమకు ఎవరితోను కలిసే అవసరం లేదన్నారు. ప్రజలే తమ పక్షాన ఉన్నప్పుడు తాము వేరొకరితో ఎందుకు కలుస్తామని ఎదురు ప్రశ్నించారు. జగన్‌ జైలుకు చేరి నేటికి 111 రోజులైంది.. 90రోజులు దాటితే ఎవరికైనా ఆటోమాటిక్‌గా బెయిల్‌ ఇవాల్సిందేనన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా 15 రోజుల పాటు జరగాల్సిందేనన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌, చేనేత కార్మికుల అవస్థలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌, విద్యుత్‌ బాధలు, తదితర అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు రోజుల సమయం సరిపోదన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు గ్యాస్‌ ధర పెంచితే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. నేడు ఆ భరోసా రాష్ట్ర ప్రజలకు కరువైందన్నారు. డీజిల్‌ ధర పెంపు ఉపసంహరణ, గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య పరిమితి తొలగింపుపై కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నిత్యావసర ధరలతో ఇప్పటికే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు కుదేలయ్యారన్నారు. బస్సు చార్జీలు పెరిగితే వారిపై మరింత భారం పడుతుందన్నారు. ఇప్పటికైనా డీజిల్‌ ధర ఉపసంహరించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండు చేశారు.
తెలంగాణ తీర్మానం చేపట్టాల్సిందే
సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండు చేయనున్నట్టు టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్ని పార్టీలు తెలంగాణ తీర్మానానికి సహకరించాలని కోరారు. టిఆర్‌ఎస్‌ను బూచిగా చూపిస్తూ సభా సమావేశాలను వాయిదా వేస్తే సహించబోమన్నారు. విద్యుత్‌ కొరతపైనా, రైతులు, విద్యార్థుల సమస్యలపైనా చర్చించాల్సిందేనన్నారు. అలాగే డీజిల్‌ ధర పెంపు, సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పరిమితిపై కూడా చర్చించాల్సిందేనని సభలో కోరనున్నట్టు చెప్పారు.
చర్చలకు సిద్ధం
విపక్షాలు ఎటువంటి సమస్య లేవనెత్తినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ అన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలుసునన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. బిఎసి సమావేశం నుంచి వాకౌట్‌ చేసి టీడీపీ తన నైజాన్ని చాటుకుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఒంటెద్దు పోకడలు పోతోందన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంటుపైనా, స్కాలర్‌షిప్‌లపైనా, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌పైనా, కరువుపైనా, విద్యుత్‌ కొరత పైనా.. ఇలా ప్రతి సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 17 అన్నది ఎంతో చరిత్రాత్మకమైన రోజు అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజలకే గాక యావత్‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభదినమన్నారు. అటువంటి శుభ దినం గురించిన విశేషాలను నెమరువేసుకోవడం, సేవలందించిన త్యాగధనులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని కోరుతున్నా నన్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిన్నింటిపై చర్చిస్తే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క సభ్యులు గుర్తెరిగి మసలుకోవాలని కోరుతున్నానని అన్నారు.
ప్రజలు క్షమించరు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు జరపడంపై ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించబోరని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కనీసం 15 రోజుల పాటు జరిగితే ప్రజల సమస్యలు కొంతవరకైనా తీరే అవకాశం ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను తరచు ఒక పార్టీ అడ్డుకుంటోందని, కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీ సభ్యులను ఉపేక్షించొద్దన్నారు.