నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం

` మేయర్‌ సహా 154 మంది మృతి
` రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదు
నేపాల్‌(జనంసాక్షి): నేపాల్‌ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ నేపాల్‌ను తాకిన ఈ బలమైన భూకంపంలో నల్గాడ్‌ మునిసిపాలిటీ డిప్యూటీ మేయర్‌తో సహా 154 మంది మరణించారు. జాజర్‌కోట్‌, వెస్ట్రన్‌ రుకుమ్‌లు భారీ నష్టాన్ని చవి చూశాయి. నేపాల్‌లో సంభవించిన పెను భూకంపం.. పలువురిని పొట్టనబెట్టుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి సమయం కావడంతో చాలా మంది ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. అందుకే ప్రాణనష్టం ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు..భూకంపంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. భూకంప ప్రకంపనలు వచ్చిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి రోడ్డుపైకి చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. జాజర్‌కోట్‌లో అత్యధిక నష్టం వాటిల్లిందని జాజర్‌కోట్‌ జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంతోష్‌ రోకా తెలిపారు. మృతుల్లో నల్‌గఢ్‌ మునిసిపాలిటీ డిప్యూటీ మేయర్‌ సరితా సింగ్‌ కూడా ఉన్నారని రోకా తెలిపారు. నేపాల్‌లో విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు స్థానికులు చేరుకున్నారు. భూకంప కేంద్రం జాజర్‌కోట్‌లో 92 మంది మరణించారు. పశ్చిమ రుకుమ్‌లో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.నేపాల్‌లోని జాజర్‌కోట్‌ జిల్లాలోని భేరి, నల్‌గాడ్‌, కుషే, బెర్‌కోట్‌, ఛేదాగఢ్‌లో భూకంపం సంభవించింది, ఎటు చూసినా విధ్వసం దర్శనం ఇస్తుంది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగమంతా సహాయక చర్యలకు శ్రీకారం చుట్టింది. అయితే నేపాల్‌తో పాటు ఢల్లీి-ఎన్సీఆర్‌లోనూ భూప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లల్లోని అనేక జిల్లాల్లో భూమి ప్రకంపించింది. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గరయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.