పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):
బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ రాజీనామాకు పట్టుబట్టడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడ్డాయి. లోక్‌సభలో డిఎంకె, ఎఐడిఎంకె, సిపిఐ, విసికె సభ్యులు సెల్‌లోకి దూసుకెళ్లి శ్రీలంక విషయాన్ని చర్చించాల్సిందిగా పట్టుబట్టినప్పటికీ లోక్‌సభ సభా కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడింది. తొలుత స్పీకర్‌ సభలోకి ప్రవేశించిన వెంటనే శివకాశీలో జరిగిన పేలుడులో దుర్మరణం పాలైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తదనంతరం స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న బిజెపి సభ్యులు ఒక్కసారిగా ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. స్పీకర్‌ మీరాకుమార్‌ సభను కొనసాగించాలని కోరారు. అయినప్పటికీ సభ్యులు వినకపోవడంతో ఆమె సభను వాయిదా వేశారు. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ కనిపించింది. కాగా, శ్రీలంక సైనిక దళాలకు ఇండియా ఎయిర్‌బేస్‌లో శిక్షణ ఇవ్వడాన్ని డిఎంకె సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసనను స్పీకర్‌ మీరాకుమార్‌కు తెలియజేశారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స త్వరలో భారత దేశ పర్యటనను చేపట్టడాన్ని కూడా నిరసిస్తూ ఎఐడిఎంకె సభ్యులు ఆయన పర్యటనను నిలిపివేయాలని స్పీకర్‌ను కోరారు.