పాక్‌ సరిహద్దుల్లో ఉన్నామా అనిపించింది


రాజ్యసభలో సెక్యూరిటీ మార్షల్స్‌ ఎందుకు
అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సంజయ్‌ రౌత్‌
ముంబై,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు జరిగిన సంఘటనలపై శిసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినపుడు సెక్యూరిటీ మార్షల్స్‌ను పిలిచారని మండిపడ్డారు. మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారా అని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రతిపక్షాలకు పార్లమెంటులో అవకాశం ఇవ్వలేదన్నారు. బుధవారం మహిళా ఎంపీల విషయంలో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. తాము పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్నామనిపించిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఈ నెల 13 వరకు జరిగి ఉండవలసింది. కానీ రెండు రోజులు ముందుగానే, ఉభయ సభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు మార్షల్స్‌పై దాడి చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ప్రవర్తన భారత దేశ ప్రజాస్వామిక చరిత్రలో మాయని మచ్చ అని దుయ్యబట్టారు. ఇదిలావుంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఉన్నాయని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులతో ఆ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ఈ నెల 20న నిర్వహించే సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే పాల్గొంటారని తెలిపారు.