ఆర్మీపై వ్యాఖ్య‌లు

 

 

 

 

 

 

నవంబర్ 20 (జనంసాక్షి)న్యూఢిల్లీ: భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భార‌త్ జోడో యాత్ర‌లో ఆర్మీపై రాహుల్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది. ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను కొట్టివేయాల‌ని కోరుతూ మే 29వ తేదీన అల‌హాబాద్ హైకోర్టును రాహుల్ ఆశ్ర‌యించారు. అయితే ఆ స‌వాల్‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు.

స‌రిహ‌ద్దుల‌ను చైనా ఆక్ర‌మించిన‌ట్లు గ‌తంలో రాహుల్ ఆరోపించారు. అయితే ఆ కేసులో ఆగ‌స్టు 4వ తేదీన సుప్రీంకోర్టు విచార‌ణ చేస్తూ.. 2 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం ఉన్న భార‌త భూభాగాన్ని చైనా ఆక్ర‌మించిన‌ట్లు ఎలా చెబుతున్నార‌ని ప్ర‌శ్నించింది. ఆ ఆక్ర‌మ‌ణ స‌మ‌యంలో మీరున్నారా, మీ ద‌గ్గ‌ర ఏదైనా న‌మ్మ‌ద‌గ్గ స‌మాచారం ఉందా అని కోర్టు అడిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. కాంగ్రెస్ నేత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.