వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు

 

 

 

 

 

నవంబర్‌ 19 (జనం సాక్షి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌ జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యూలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, చలిగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27వరకు తెలంగాణ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. చలికి వర్షాలు తోడైతే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయని.. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.