పాత సీసాలో కొత్తసారా

మద్యం సిండికేట్ల దందాలను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్‌ విధానం పాత సీసాలో కొత్త సారాలా ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానంలో లొసుగులను ఆసరాచేసుకుని అన్ని షాపులను బినామీల పేరుతో కొందరే చేజిక్కించుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీల కంటే ఇష్టం వచ్చిన రేటుతో మద్యం విక్రయాలు సాగిస్తూ కోట్లు గడించారు. అక్రమార్జనపై దృష్టిసారించిన మద్యం వ్యాపారులు పొరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ అధిక ధరలకు విక్రయించి లాభాలు గడించారు. మరో పక్క ప్రభుత్వ ఆదాయానికి లక్షల కోట్ల రూపాయలు మేరకు గండికొట్టారు. సిండికేట్ల వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని విచారణకు ఆదేశించడంతో దొంగలకు తేలుకుట్టిన చందంగా ప్రభుత్వ పెద్దలే దోషులని తేలారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎక్సైజ్‌ మంత్రిగా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణతో సహా అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్సైజ్‌ అధికారులు, పోలీసు అధికారులు మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు పుచ్చుకున్నారు. పలు జిల్లా జిల్లాలో రాజకీయ పార్టీలు అక్రమంగా డబ్బు దండుకున్నాయి. నీతులు వల్లించే జర్నలిస్టులు కూడా మద్యం వ్యాపారుల వద్ద ముడుపులు పుచ్చుకున్నారు. తన లాభాలను తగులబెట్టుకుంటూ తన వేలుతో కంట్లో పొడుచుకోలేమని మేల్కొన్న ప్రభుత్వం మద్యం సిండికేట్ల దూకుడుకు కళ్లెం వేసిన ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయగా, మద్యం సిండికేట్లకు సింహస్వప్నంగా మారిన భూపతిబాబుకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది. భూపతిబాబును ఆ పదవిలోనే కొనసాగిస్తూ ఆయనపై మరో సీనియర్‌ అధికారి ప్రసాద్‌రావు నియమించి పొమ్మనలేక ప్రభుత్వం పొగబెట్టింది. ప్రజల రక్తాన్ని సంపదగా  మార్చుకునేందుకు రుచి మరిగిన బడా నేతలు, అధికారులు పులులు గడ్డి తినవన్న చందంగా వారు తమ పాత విధానాలు మార్చుకుంటారనుకోవడం అత్యాశే. మద్యం అక్రమార్కుల్ని వేలంపాటలో పాల్గొనకుండా ప్రభుత్వం ఇక్కడ తగు చర్యలు తీసుకోలదు. బినామీల పేరిట షాపులు తీసుకునే వారు వేలం పాటల్లో పాల్గొనకుండా ఎలాంటి జీవో జారీ చేయకపోవడం వల్ల కొత్త విధానం కూడా కొత్త సీసాలో పాత సారా లాంటిదే అవుతోంది.