పేదల న్యాయవాది చంద్రశేఖర్‌ ఇకలేరు

హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత, రచయిత బి.చంద్రశేఖర్‌ (49) మంగళవారంనాడు మృతిచెందారు. ఆయన మృతి పట్ల మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులకు ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఆయన వాదించారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపారు. చుండూరు ఊచకోత కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉంటూ.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రచయితగా కూడా ఆయన పేరుపొందారు. శాంకో వాజెట్టి కేసుకు సంబంధించి ఆయన సమగ్ర రచనను అందించారు. అలాగే ఎన్జీవోల కథను రాసి పలువురి ప్రశంసలు పొందారు. చంద్రశేఖర్‌ అంత్యక్రియలు బుధవారం గుంటూరు జిల్లాలో జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.