‘పోలవరం కోసం ఎదురు చూడడం మంచిది కాదు’

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వచ్చే వరకు ఎదురు చూడడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే ఎంత మంది వ్యతిరేకించిన పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని ఆయన శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కరువు తీవ్రత అధికంగా ఉన్నా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించామని సభలో చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు.
రాష్ట్రంలో 10196 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని ఆయన గుర్తు చేశారు. 1644 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రవాణ ద్వారా నీరు ఇవ్వడానికి తగిన చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి మరీ తీవ్రంగా ఉందని … దాంతో 415 బోర్ వెల్స్ ద్వారా నీటి కోసం బోర్లు వేయిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం ఇప్పటికే రూ. 83.32 కోట్లు విడుదల చేశామన్నారు.
కరవు సమయంలో బాధ్యతగా వ్యవహారించాలని ఆయన ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు సూచించారు. పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ఆదుకుంటామన్నారు. ఎండు గడ్డి కిలో రూ. 3, పశువుల దాణా రూ.8 చోప్పున ఎండు గడ్డిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులు పెంచామన్నారు.