ప్రచారానికి తెర ఓటర్లకు ఎర!- నేడే ‘సింగరేణి’ గుర్తింపు సంఘం ఎన్నికలు

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో రెండు నెలలుగా  సాగిన ప్రచారం తెరపడడంతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా సంఘాలు వింధులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన పోలింగ్‌ జరుగుతుండడంతో చివరి ఆస్త్రంగా ఆయా సంఘాల నేతలు కార్మికులను మచ్చిక చేసుకోవడానికి చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. సింగరేణిలో 4 సార్లు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండుసార్లు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాయి. ఈ ఎన్నికల్లో 14 కార్మిక సంఘాలు పోటీ పడుతుండగా ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల మధ్యనే పోటీ నెలకొని ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో అత్యధికంగా 23 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. దీంతో ఆయా కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీల నేతలు ఈ ప్రాంతంలో తిష్టవేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  గురువారం నాడు జరగనున్న పోలింగ్‌కు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా  30 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా  భారీ పోలీస్‌ బందోస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌ అనంతరం సాయంత్రం ఫలితాలను వెల్లడించానున్నారు.