ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదు
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, మార్చి 6 (జనం సాక్షి);
ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ,దరఖాస్తు చేసిన వారంలోపు సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు,తహసిల్దార్లకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 118 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. వీటిలో 8 దరఖాస్తులు ఆసరా పెన్షన్ సమస్యలపై రాగా మిగతావి రేషన్, ఎక్సైజ్, భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులు వారంలోపు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని, సమస్యలపై రెండు, మూడు వారాల నుండి అదే దరఖాస్తు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్ డి ఓ రాములు,ఏ ఓ యాదగిరి జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.