ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి.
ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం జరుగుతుందని, ఇందుకు గాను 286 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బుధవారం నాడు పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో ప్రస్తుత ఖరీఫ్ లో వరి ధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబరు రెండవ వారంలో ధాన్యం కోతలు పూర్తయి మార్కెట్లోనికి వరి ధాన్యం వస్తుందని, కొనుగోలు చేసేందుకు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, త్రాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్ 2022-23 సీజనులో సుమారు 6 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంచనా వుందని, దీనిలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేయవలసి వుంటుందని, గతంలో తెరచిన విధంగా ఐ.కె.పి. ద్వారా 85, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 197, మార్కెటింగ్ శాఖ ద్వారా 4 కొనుగోలు కేంద్రాలతో మొత్తం 286 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ యం.గోపి కృష్ణ, డి.ఎస్.ఓ. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, ఐ. కే. పీ, పి. ఏ. సి. ఎస్ అధికారులు పాల్గొన్నారు.