ప్లీజ్‌.. పిల్లల్ని కనండి


` భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్‌..
ప్యాంగ్యాంగ్‌(జనంసాక్షి): ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన.అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ కన్నీళ్లు కార్చారు. ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తుండటంతో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు కిమ్‌ మాట్లాడుతూ.. ‘’జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది’’ అని తెలిపారు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్‌ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.అయితే, గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. కరోనా వెలుగుచూసిన నాటి నుంచి కిమ్‌ తమ దేశ సరిహద్దులను మూసివేశారు. ప్రపంచంతో చాలా వరకు ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో వ్యాపార, వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నట్లు గతంలో పలు అంతర్జాతీయ విూడియా కథనాలు వెల్లడిరచాయి. ఇలాంటి సమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్‌ సూచించడం గమనార్హం.ఇదిలా ఉండగా.. కిమ్‌ పాలనలో కఠిన శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న కారణాలకే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. గతంలో దక్షిణ కొరియాకు చెందిన వీడియోలు చూశాడని ఓ వ్యక్తిని బహిరంగంగా చంపేశారు. ఇలాంటి సంఘటలెన్నో అక్కడ చోటుచేసుకున్నాయి. ఇలాంటి కఠిన ఆంక్షలతో ఉ.కొరియా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి రహస్యంగా ఉ.కొరియా నుంచి పారిపోయినట్లు కొన్ని విూడియా కథనాలు వెల్లడిరచాయి. దీంతో ఇప్పుడా కుటుంబం కోసం కిమ్‌ యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోందట..!