బహుళ ప్రయోజనాల అగస్టా హెలికాప్టర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెల్ల ఏనుగంటూ ముద్దుగా పిలుచుకునే అగస్టా హెలికాప్టర్ నిన్న అర్థరాత్రి బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. 2008లో దాదాపు 63 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటలీ నుంచి ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసింది. కర్నూలు వరదల సమయంలో సహాయక చర్యలు, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యమంత్రి, ఇతర వీఐపీల ప్రయాణంతోపాటు బహుళ ప్రయోజనాల కోసం సర్కారు దీనిని వినియోగిస్తోంది. ఏడబ్య్లూ -139 మోడల్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌లో పైలట్, కోపైలట్‌తో సహా మొత్తం 15 మంది వరకూ ప్రయాణించవచ్చు . గంటకు 257 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ హెలికాప్టర్ 505 నాటికల్ మైళ్లు నిర్విరామంగా ప్రయాణిస్తుంది. ముఖ్యమంత్రికి మినీ కార్యాలయం తరహాలో అధికారులు ఎదైనా అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే సదుపాయాలు ఇందులో ఉన్నాయి.