బాబుకు మళ్లీ తెలంగాణ సెగ..

పాదయాత్రను అడ్డుకొన్న తెలంగాణవాదులు
తెలంగాణపై కేంద్రమే ప్రకటన చేయాలి
ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం
పాదయాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై వైఖరి చెప్పకుండా పర్యటిస్తున్న బాబును మరోసారి తెలంగాణవాదులు అడ్డుకొ న్నారు. కోయిల కొండ కు చేరుకున్న తరుణంలో పలువురు తెలంగాణ వాదు లు అక్కడికి చేరుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వీరిని అడ్డుకునేందకు టిడిపి శ్రేణులు ప్రయత్నించడంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి
ఏర్పడింది. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో వారుపోలీసులపై రాళ్ళు రువ్వారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ జరిపారు. ఇరుపక్షాల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఓ కెమెరామెన్‌ కూడా ఉన్నారు. చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా ఆందోళన కారులు నినాదాలు చేశారు. ఈ నిరసన జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు మాట్లాడుతూ తాను తెలంగాణకు వ్యతిరేకిని కానని చెప్పారు. తెలంగాణపై కేంద్రమే తేల్చాల్సీ ఉందని చెప్పారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పరిస్థితులను, ప్రజల భావోద్వేగాలను, ఆకాంక్షలను గుర్తించి కేంద్రం వెంటనే తెలంగాణపై ప్రకటన చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.
ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానం..
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక హాక్కుకాంగ్రెస్‌ పార్టీకి లేదని ఆ పార్టీని సాంఘీక బహిష్కరణ చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పేదల బతుకులను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి కనీసం గంటపాటు కూడా పాలించే హక్కులేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీతో భారతీయ జనతాపార్టీ కూడా పోటీ పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కిరికిరిరెడ్డిగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. తల్లి కాంగ్రెస్‌లో నుంచి విడిపోయిన పిల్ల కాంగ్రెస్‌ మళ్లీ ఏదోరోజున తల్లితో చేరిపోతుందని పరోక్షంగా వైయస్సార్‌ సీపీని ఉద్దేశించి అన్నారు. ఏ తప్పు చేయకుంటే జగన్‌ ఎందుకు జైలుకు వెళ్ళారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పాలన పై పట్లు లేదని,ఆయన పాలన తెలియదని అన్నారు. కనీసం 3గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పరిపాలనపై అనుభవం లేనివారు హామీలు గుప్పిస్తున్నారని వైయస్సార్‌ సీపీని ఉద్దేశించి అన్నారు.
సంతోష్‌ మృతిపై విచారం..
తెలంగాణ కోసం సంతోష్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పట్ల చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను గుర్తుంచుకోవాలని ఎవరూ భావోద్రేకాలకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రబాబు పాదయాత్రలో బుధవారం నాడు తెలంగాణ సెగ తగిలింది.