బాబు వల్లనే కృష్ణా డెల్టా ఎడారి : జోగి రమేష్
విజయవాడ, ఆగస్టు 2: కృష్ణ డెల్టా బీడు అవుతున్నదంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి రాష్ట్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇది చేతకాని ప్రభుత్వమని బాబు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. ఇడుపులపాయకు కృష్ణా జలాలు ఇవ్వడం వల్లనే ఇక్కడ ఈ పరిస్థితి ఉత్పన్నమైనదని అనడాన్ని ఆయన తోసిపుచ్చారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పు వల్లనే కృష్ణా డెల్టా ఇప్పుడు శిక్ష అనుభవిసున్నదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఏనాడూ డెల్టాను పట్టించుకోలేదని ఇప్పుడు తగుదునమ్మ అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం గురువింద గింజ చందంగా ఉందని విమర్శించారు. బాబు గతంలో జారీ చేసిన కొన్ని జీఓలే కృష్ణా డెల్టాకు శాపంగా మారిందని అన్నారు. టిడిపి నేతలు ముఖాముఖి చర్చకు వస్తే తాను ఈ విషయాలన్ని రుజువు చేస్తానని జోగి రమేష్ సవాల్ విసిరారు.