విస్తృత ఎజెండా..!!
డిసెంబర్ 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
సంక్షేమ పథకాల అమలు, విధివిధానాలపై చర్చకు ఛాన్స్
రైతు భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు
కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం
సీఎం అధ్యక్షతన మీటింగ్.. సీఎస్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, డిసెంబర్ 23 (జనంసాక్షి)
ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడిగా ముగియడం, శాసనసభలో అనేక అంశాలపై ఉద్రిక్త వాతావరణం తలపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన విషయం విదితమే. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయాలూ, ప్రతిపక్షాలకు గట్టి సమాధానాలతో అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇదే తరుణంలో డిసెంబర్ 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో కీలక అంశాలు ఎజెండాగా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, వాటి విధివిధానాలపై సమగ్ర చర్చలు జరగనున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుపై సమాలోచనలు జరగనున్నాయి. సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్న రైతు భరోసా పథకం విషయంలో వాటి విధివిధానాలు, సాధ్యాసాధ్యలు చర్చకు రానున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రకటించగా.. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే అంశం త్వరలోనే తేలిపోనుంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు ఇటీవలే నిర్ణయించింది. అందుకు సంబంధించి రేషన్ కార్డు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉపసంఘం సమాలోచనలు మంత్రివర్గ మీటింగులో చర్చకు రానున్నాయి. రేషన్ కార్డు ప్రాతిపదికనే ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సిన దరిమిలా దీనిపై సమగ్రంగా సూచనలు అందనున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏండ్ల తరబడి వారి దరఖాస్తులు పెండిరగ్‌లోనే ఉన్నాయి. ఈ అంశంపై ప్రధానంగా విధివిధానాలు వెల్లడిరచనున్నది సర్కారు..! పూర్వపరాలను పరిశీలించి రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.