బాలల వసతి గృహం ప్రారంభం

కరీంనగర్‌, జూలై 19 : పట్టణ అణగారిన బాలల వసతి గృహాన్ని గురువారం నగరంలో గిద్దె పెరుమాండ్ల గుడి దగ్గర జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడుతూ మధ్యలో బడి మానివేసిన వీధి బాలలకు విద్య నేర్పించేందుకు వసతి గృహం ఎంతో ఉపయోగపడుతుందని, అణగారిన బాలల వసతి గృహంలో 100మంది పిల్లలకు వసతి, భోజనంతో పాటు విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. వసతి గృహంలో కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. వసతి గృహంలో చదివిన పిల్లలను వారి స్థాయిని బట్టిపై తరగతులలో చేర్పిస్తారని తెలిపారు. అణగారిన బాలల ఉజ్వల భవిష్యత్తుకు వసతి గృహం ఎంతో తోడ్పడుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వసతి గృహంలో చేరిన విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు, పలకలు, బలపాలు, బేడ్‌ షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ విద్యామిషన్‌ ప్రాజెక్టు అధికారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు