బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

share on facebook

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి

వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ మూలాలు ఉన్న సవిూరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్‌ఈసీ)లో చోటు లభించింది. ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె నియామకానికి సంబంధించి గురువారం బైడెన్‌ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్‌ చీఫ్‌గా, వేదాంత్‌ పటేల్‌కు వైట్‌ హౌస్‌ అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా, వినయ్‌ రెడ్డిని స్పీచ్‌ రైటింగ్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ టీంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా గౌతమ్‌ రాఘవన్‌, కశ్మీరీ మహిళ ఈషా షా(వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌) కూడా కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు సవిూర కూడా ఈ జాబితాలో చేరారు.

ఒబామా అనుచరురాలిగా గుర్తింపు

న్యూయార్క్‌లోని విలియమ్స్‌విల్లేలో సవిూరా ఫాజిలి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు యూసఫ్‌, రఫీకా ఫాజిలూ. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.. హార్వర్డ్‌ కాలేజీ, యేల్‌ లా స్కూల్‌ నుంచి ఉన్నత విద్య పూర్తిచేశారు. యేల్‌ లా స్కూళ్లో లెక్చరర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె కన్జూమర్‌, హౌజింగ్‌, చిరు వ్యాపారాలు, మైక్రోఫైనాన్స్‌ తదితర విభాగాల్లో పనిచేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఇక సవిూర ఫాజిలి గతంలో.. అట్లాంటా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు ఆర్థికాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఎన్‌ఈసీ సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు.అదే విధంగా ఒబామా హయాంలో డొనెస్టిక్‌ ఫినాన్స్‌, విదేశీ వ్యవహారాల సీనియర్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు నెరవేర్చారు. ఇక ఇప్పుడు అమెరికాలో కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ సతీమణి, కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ బృందంలో భారతీయ మహిళకు కీలక పదవి దక్కింది. భారత సంతతికి చెందిన గరీమా వర్మను జిల్‌ బైడెన్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా నియమించినట్లు సమాచారం

 

Other News

Comments are closed.