బోధనా రుసుం ఎత్తివేసేందుకు కుట్ర

హైదరాబాద&: ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి బోధనా రుసుం తిరిగి చెల్లించే పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. బీసీ విద్యార్థులకు రుసుం తిరిగి చెల్లించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని మందకృష్ణ గుర్తు చేశారు. బీసీ విద్యార్థులకు అదనంగా అవసరమయ్యే రూ.500 కోట్లను భారంగా భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. బీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఎమ్మార్పీఎస్‌ సహించదని, తాము చేపట్టే ఉద్యమ పర్యవసానాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని మందకృష్ణ హెచ్చరించారు.