బ్యాటింగ్‌లో చిచ్చర పిడుగు

కేరళ, నవంబర్‌ 2 :

ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్‌ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల నృత్యకారుడూ కాదు. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేయడంలో అత్యంత ప్రతిభ కనబరచడంతో ఇంటర్నెట్‌కు ఎక్కాడు. ఇతని తండ్రి రాజేశ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. చిన్న వయస్సు నుంచే కుమారుడు బ్యాటింగ్‌లో చూపిస్తున్న మెలకువలను గమనించి ఒక ప్రత్యేకమైన కోచ్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఈ చిన్నారికి శిక్షణ ఇస్తున్న కోచ్‌ బిజుగార్జే సైతం కృష్ణ బ్యాటింగ్‌ చేస్తున్న విధానానికి ముచ్చటపడి ఈ బ్యాటింగ్‌ సీనియర్లను తలపిస్తున్నదని ప్రశంసిస్తున్నారు. తండ్రి తన కొడుకు బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని వీడియో చిత్రీకరించి యూ ట్యూబ్‌లో ప్రసారం చేయడంతో దాదాపు 5 లక్షల మంది క్రికెట్‌ ప్రియులు ఈ చిన్నారి బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని వీక్షించి ప్రశంసల జల్లు కురిపంచారు. భవిష్యత్తులో కృష్ణ ప్రతిభావంతుడైన క్రికెట్‌ క్రీడాకారుడిగా వెలుగొందుతాడని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌ విజుగార్జే అంటున్నారు. ఇటీవల తిరువనంతపురంలో సీనియర్‌ క్రికెట్‌ క్రీడాకారులతో సైతం కృష్ణ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడి ప్రశంసలు పొందాడు. క్రికెట్‌లో లెజండ్స్‌ తో పాటు తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్‌ సచిన్‌తో ఆడటం తన భవిష్యత్తు కల అని ఈ చిన్నారి చెప్పడం గమనార్హం.