భారత్ బయోటెక్‌కు మరో గౌరవం
హంగరీ నుంచి జీఎంపీ ధ్రువపత్రాన్ని పొందిన కొవాగ్జిన్
హైదరాబాద్,ఆగస్ట్5( జనంసాక్షి): కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్‌కు మరో గౌరవం దక్కింది. కొవాగ్జిన్ తయారీకి మెరుగైన తయారీ పద్ధతులు (జీఎంపీ) కంపెనీ అనుసరిస్తోందని పేర్కొంటూ ఐరోపా దేశం హంగరీ ధ్రువపత్రాన్ని జారీ చేసింది. గురువారం ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ట్విటర్ వేదికగా వెల్లడిరచింది. ‘’భారత్ బయోటెక్ మరో మైలురాయిని చేరుకుంది. హంగరీ నుంచి కొవాగ్జిన్ జీఎంపీ ధ్రువపత్రాన్ని పొందింది. ఐరోపా నియంత్రణ సంస్థల నుంచి బయోటెక్ అందుకున్న మొదటి సమ్మతి పత్రమిది’’ అని భారత్ బయోటెక్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రపంచస్థాయి నాణ్యతతో టీకా తయారు చేస్తున్న తమ సంస్థకు ఇది శుభవార్తని భారత్ బయోటెక్ ఆనందం వ్యక్తం చేసింది. కరోనాపై జరుపుతున్న పోరాటంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఇది దోహదపడుతుందని వెల్లడిరచింది. హంగరీ దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, న్యూట్రిషన్ నుంచి దీన్ని పొందినట్లు పేర్కొంది. అది ఔషధ ఉత్పత్తులకు లైసెన్సులు ఇచ్చే అధికారిక సంస్థ. తాజా ధ్రువపత్రం డేటాబేస్‌లో లిస్టయి ఉంటుంది. ఐరోపా కమ్యూనిటికీ సంబంధించి తయారీ అనుమతులు, జీఎంపీ ధ్రువపత్రాలు పొందిన సంస్థల జాబితా ఆ డేటాబేస్‌లో పొందుపరిచి ఉంటుంది.