భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం
– సుమారు రూ.కోటి నష్టం
– ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం
గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన వర్షంతో… సింగరేణి రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో గురువారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షపు నీరు ఓపెన్‌కాస్ట్‌ల్లో చేరడంతో… బొగ్గును ఉత్పత్తి పనులను నిర్వహించడానికి ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో అధికారులు, కార్మికులు పనిస్థలాల్లోకి వెళ్ళ లేకపోయారు. యంత్రాలతో పనిచేయించలేకపోయారు. బుధ వారం నైట్‌షిప్ట్‌లో కొంతమేరకు బొగ్గు ఉత్పత్తిని చేసినప్పటికి బుధవారం బొగ్గు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. దీంతో మూడు షిప్టుల్లో ఓసిపి-1,2,3,4లలో అధికారులు, కార్మికులు పనులు లేకుండా ఖాళీగానే ఉండిపోయారు. నాలుగు ఓపెన్‌కాస్ట్‌ల్లో ప్రతిరోజు సుమారు 40వేల టన్నుల వరకు బొగ్గును ఉత్పత్తి చేస్తారు. ఈ లెక్కన మార్కెట్‌ ధర ప్రకారం… సింగరేణికి సుమారు రూ.కోటి నష్టం జరిగినట్టు అనధికారికంగా తెలుస్తోంది. అలాగే ఇతర వ్యయం క్రింద సుమారు రూ.50లక్షల వరకు నష్టం వచ్చినట్లుగా తెలిసింది. కాగా, రామగుండం సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఎన్టీపీసీ)లో విద్యుదుత్పత్తికి ఈ ఓపెన్‌కాస్ట్‌ల ద్వారానే బొగ్గును రోజువారీగా పంపిణీ జరుగుతోంది. వర్షంతో ఉపరితల గనుల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో… ఎన్టీపీసీకి కూడా… బొగ్గు పంపిణీ ఆగిపోయింది. ఎన్టీపీసీలో నిల్వ ఉన్న బొగ్గుతో విద్యుదుత్పాదనను అధికారులు చేయనుండగా, బుధవారం ఓసిపిల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తితో ఎన్టీపీసీ విద్యుదుత్పత్తికి రానున్న రోజుల్లో ఆటంకం ఎదురయ్యే ప్రమాదం ఉంది. 2600మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసే రామగుండం ఎన్టీపీసీలో నిర్దేశిత ఉత్పత్తికి నష్టం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎన్టీపీసీ నుంచి జరిగే విద్యుత్‌ సరఫరా నిలవనుంది. పారిశ్రామిక కార్యనిర్వహణకు అడ్డంకిగా మారనుంది.