మంత్రి పొన్నాలకూ న్యాయ సహాయం

హైదరాబాద్‌, జూలై 10 : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులలో మోపిదేవి మినహా మిగిలిన ఐదుగురు మంత్రులకు ప్రభుత్వం తరఫున న్యాయ సహాయం అందించినట్టయింది. ఈ వ్యవహారంలో తొలుత కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావుకు న్యాయ సహాయం అందించేందుకు నిర్ణయించారు. వారి తరఫున కోర్టులో వాదించే న్యాయవాదులకు ఆయా శాఖల నుంచి ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో జారీ చేసింది. అంతకుముందు నోటీసులు అందుకున్న మంత్రులందరి నుంచి న్యాయ సహాయం చేయాలంటూ లేఖలను స్వీకరించింది. మంత్రి పొన్నాల కూడా లేఖ రాశారు. అయితే ఆయన లేఖ ఆర్థికశాఖలో అదృశ్యం కావడంతో తొలుత నలుగురికి న్యాయ సహాయం అందించాలని జీవో జారీ అయింది. జగన్‌ ఆస్తుల కేసులో అరెస్టు అయిన మోపిదేవి వెంకటరమణతో పాటు పొన్నాల లక్ష్మయ్య పేరును పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. పొన్నాల కూడా మనస్థాపానికి గురయ్యారు. దీంతో పొన్నాల నుంచి మరో లేఖ తీసుకుని ఆయనకు కూడా న్యాయ సహాయం అందించాలంటూ జీవో జారీ చేశారు. అయితే అరెస్టయిన మోపిదేవి వెంకట రమణకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయ సహాయం అందడం లేదన్నది స్పష్టమైంది. అయితే ఆయనకు పార్టీ నుంచి సహాయం అందించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మంత్రులతో పాటు సుప్రీం నోటీసులు అందుకున్న ఎనిమిది మంది అధికారులకు న్యాయ సహాయం విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పి. సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సూప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.