మన శరీరానికి కొలెస్ట్రాల్‌ అత్యవసరం..

మన శరీరానికి కొలెస్ట్రాల్‌ అత్యవసరం. కొలెస్ట్రాల్‌ శరీరంలో కణాల తయారీలో సహాయపడుతుంది. కానీ, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువైతేనే.. ముప్పు వాటిల్లుతుంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన సమస్యల కారణంగా.. ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఎక్కువైంది. చెడు కొలెస్ట్రాల్‌ వల్ల రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడుతుంటాయి. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు, థైరాయిడ్‌, మోకాళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్‌కు లక్షణాలు కనిపించవు.. కాబట్టి దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం. పౌష్టిక ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, రెగ్యులర్‌ చెకప్స్‌ ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. 

నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NHLBI) ప్రకారం, తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల మధ్య మొదటి కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలుకు ఒకసారు ఈ టెస్ట్‌ చేయించుకోవడం మంచిది. 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల పురుషులు, 55 నుంచి 65 సంవత్సరాల వయసు గల స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకు కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌‌‌‌ చేయించుకోవడం మంచిది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతీ సంవత్సరం కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.