రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
మార్చి31(జనంసాక్షి):రాష్ట్రాన్నినడిపేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన తాతాలిక రుణ సదుపాయాలను భారీ స్థాయిలో వినియోగించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది.రాష్ట్రంలో కనీస నగదు నిల్వలను నిర్వహించేందుకు ఈ రుణాలను తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ’ ద్వారా రూ.27,730 కోట్లు 363 రోజులపాటు వినియోగించింది. చేబదులు రుణాల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల) రూపంలో రూ.64,188 కోట్లు 298 రోజులపాటు పొందింది. ఈ అడ్వాన్సుల కింద ఇంకా రూ.5,842 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభు త్వం ‘ఓవర్ డ్రాఫ్ట్’పై కూడా భారీగా ఆధారపడుతున్నట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. రాష్ట్రాల వద్ద నగదు నిల్వలు నిర్దేశిత పరిమితి కంటే తగ్గినప్పుడు ఆర్బీఐ నుంచి ‘ఓవర్ డ్రాఫ్ట్’ తీసుకుంటాయి. మన రాష్ర్టానికి నగదు నిల్వల పరిమితి రూ.1.38 కోట్లుగా ఉన్నది. 2024-25లో ఈ నిల్వలు పరిమితి కంటే దిగువకు పడిపోవడంతో ప్రభుత్వం రూ.37,457 కోట్ల ‘ఓవర్ డ్రాఫ్ట్’ను 123 రోజులపాటు వినియోగించింది.
ఓపెన్ మార్కెట్ నుంచి భారీగా రుణాలు
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు గణనీయంగా పెరిగినట్టు వెల్లడించింది. 2024-25లో ఓపెన్ మారెట్ నుం చి 58 రుణాల ద్వారా 7.07-7.48 వడ్డీతో రూ.56,209 కోట్లు సమీకరించిందని, వీటిని 2035-55 మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా, ఎల్‌ఐసీ, జీఐసీ, నాబార్డ్ లాంటి ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.759 కోట్లు సమీకరించినట్టు పేర్కొన్నది. దీంతో ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు’ మినహా రాష్ట్ర అంతర్గత అప్పులు రూ.56,968 కో ట్లుగా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత అప్పులపై రూ.15,688 కోట్లు చెల్లింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, అడ్వాన్సుల రూపంలో రూ.2,727 కోట్లు పుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఖాతాకు తిరిగి రూ.2,479 కోట్లు చెల్లించింది.
మూలధన అప్పులు, ఖర్చుల్లో భారీ తేడా
రాష్ట్ర ప్రభుత్వం మూలధనం కోసం చేసిన అప్పులకు, చేసిన ఖర్చులకు భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. 2023-24లో ఈ అప్పులు రూ.50,528 కోట్లుగా, వ్యయం రూ.43,918 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అప్పులు రూ. 56,968 కోట్లకు పెరిగినప్పటికీ మూలధన వ్యయం రూ.36,072 కోట్లకే పరిమితమైంది. దీంతో మూలధన వ్యయం కోసం తీసుకున్న అప్పుల వినియోగం స్థిరంగా లేకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


