మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 01 (జనం సాక్షి ): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్లను,హోర్డింగులను వితరణ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వీటిని లాంఛనంగా అందజేశారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజలలో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్ మహిళా సాధికారత విభాగం వారిని ప్రశంసించారు. బాలికలు, మహిళల సహాయం కోసం ఉద్దేశించిన హెల్ప్ లైన్ నెంబర్లతో రూపొందించిన హోర్డింగ్ లను కలెక్టర్ పరిశీలించారు. వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఉపకరించడంతో పాటు మహిళా సాధికారత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందేందుకు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి పద్మ అనిల్, మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త స్వప్న తదితరులు పాల్గొన్నారు.