మహబూబ్‌నగర్‌లో బగ్గుమన్న కాంగ్రెస్‌ విభేదాలు

మందజగన్నాథంపై దాడికి యత్నం
మహబూబ్‌నగర్‌,జూన్‌ 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథంపై దాడి చేసినంత పని చేశారు. స్టేజీపై కుర్చీలు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. డీసీసీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో తొలుత నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథం ప్రసంగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరింత చొరవ ప్రదర్శించాలని, మన మాటలు, అనుసరిస్తున్న విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామనే భావన తెలంగాణ ప్రజల్లో కనిపిస్తోందని జగన్నాథం తన ప్రసంగంలో పేర్కొన్నారు. అదిష్టానం మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలకు పార్టీ శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాటలతో డీకే అరుణ వర్గీయులైన విష్ణువర్ధన్‌రెడ్డి, జగదీశ్వర్‌ల అనుచరులు మందా జగన్నాథంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంతో ఊగిపోతూ కుర్చీలు విసిరి దాడికి తెగబడ్డారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం జగన్నాథం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.