మహా ట్రాక్టర్ ర్యాలీకి సర్వంసిద్ధం
– భగ్నానికి పాక్‌లో కుట్ర జరుగుతోందట!
-ఢిల్లీ పోలీసులు
దిల్లీ,జనవరి 24(జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర జరిగిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం సుమారు 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారని దిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ (ఇంటిలిజెన్స్) దీపేంద్ర పాథక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం విూడియాతో మాట్లాడారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరగనుందని తెలిపారు.”రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్‌లో సుమారు 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివిధ నిఘా వర్గాల ద్వారా తెలిసింది. సవాలుతో కూడినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది” అని పాథక్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలోకి రైతులు ప్రవేశించేందుకు అనుమతిస్తున్నామని, అదే సమయంలో వేడుకలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని రైతులకు సూచించారు. వేడుకల అనంతరం ర్యాలీ జరుగుతుందని చెప్పారు. మరోవైపు పోలీసులు అనుమతిచ్చిన విషయాన్ని రైతు సంఘాల నేతలు శనివారమే వెల్లడించగా.. పోలీసులు ఆదివారం దీనిపై స్పష్టతనిచ్చారు.