మహిళా ఓటర్లదే హవాపోలవరంలో ఏడు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

ఓవైపు పోలింగ్‌ జరుగుతున్నా మరో వైపు నగదు పంపిణీ

పట్టించుకోని పోలీసులు

ఏలూరు, జూన్‌ 12 : పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరుగుతున్న నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దాంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటలకు నర్సాపురంలో 56 శాతం, పోలవరంలో 55 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలం బర్రెంకల పాలెం పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో గంట సేపు పోలింగ్‌ నిలిచిపోయింది.  బొత్తాయిగూడెం మండలంలోని ఏడు గ్రామాల్లో సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపు మేరకు ప్రజలు పోలింగ్‌లో పాల్గొనలేదు. రెడ్డికోపల్లె, చింతపల్లి, గుమ్ములూరు, లంకపాకల, చింతలూరు తదితర గ్రామాల్లో బహిష్కరణ ప్రభావం వల్ల పోలింగ్‌ నిలిచిపోయింది. జిల్లా ఎస్పీ ఎం.రమేశ్‌రెడ్డి పోలీస్‌ బలగాలతో రంగప్రవేశం చేశారు. పోలవరంలో పోలింగ్‌ ప్రక్రియను పరిరక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ వాణిమోహన్‌ ఆయా గ్రామాలలో పోలీంగ్‌ బహిష్కరణ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామస్థులతో చర్చించాలని, ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను ఒప్పించడానికి ఎస్‌ఐ రమేశ్‌రెడ్డి  రంగంలోకి దిగారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌  అధికారి సత్యనారాయణ ఆయా గ్రామాల పెద్దలతో  రాజకీయ పక్షాల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ గ్రామాలలో పోలింగ్‌ ప్రారంభం కాలేదు.  ఇక బొత్తాయిగూడెం మండలం రాజనగరంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఇనుప రాడ్‌ పట్టుకుని తిరిగిన కొయ్యలగూడెం మండల సాక్షి పత్రిక విలేకరి ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. రెండు రోజుల క్రితం ఇతనిపై ఆంధ్రభూమి విలేకరి దాడిచేసిన దరిమిలా ఈ రోజు జరిగిన పోలింగ్‌ సందర్భంగా మళ్లీ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారన్న సమాచారం మేరకు కొన్ని చోట్ల వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు వారితో గొడవకు దిగారు.

ఇక నర్సాపురం నియోజకవర్గం విషయానికి వస్తే నర్సాపురం రూరల్‌ మండలం సీతారామపురం పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. మొగల్తూరు మండలం బంగారమ్మపేట గ్రామంలోనూ అదే పరిస్థితి. ఈ రెండు చోట్ల గంట సేపు పోలింగ్‌ నిలిచిపోయింది.  కొత్తోట గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలో ఒక వ్యక్తిపై సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ చేయి చేసుకోవడంతో తలెత్తిన వివాదం గొడవకు దారితీసింది. గ్రామస్థులు పోలీసులపై రెచ్చిపోయారు. ఇక్కడ కూడా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. మొగల్తూరు మండలంలో బియ్యపుతిప్ప,  వేములదీవి, పేరుపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లో మత్స్యకారులకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి కార్యకర్తలను తరిమేశారు. మొగల్తూరు మండలం నర్సాపురం రూరల్‌ గ్రామాల్లోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ పక్కన పోలింగ్‌ జరుగుతున్నా, స్లిప్పులతో పాటు రూ.500 పంపిణీ చేసినా పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌, జేసీ బాబూనాయుడు పోలవరంలో ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు. అదనపు జేసీ శేషగిరి బాబు నర్సాపురంలో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు.  పోలింగ్‌ సందర్భంగా  రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.  పోలింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో భారీ పోలింగ్‌ నమోదవుతుందన్న అంచనాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి.