ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్ పాటిల్
బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ మాత్రమే రాణించారు. రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ముంబయి జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె వచ్చారు. అయితే, సీనియర్ల వల్ల కుర్రాళ్లకు అవకాశాలు మిస్ అవుతున్నాయని.. నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నించాలని సూర్య-దూబెలకు ముంబయి చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ సూచించాడు. రోహిత్, యశస్వి, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానె వంటి ప్లేయర్లు ఉన్నా జమ్మూకశ్మీర్ చేతిలో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించాడు.
‘‘దేశవాళీలోకి అడుగుపెట్టే భారత క్రికెటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. దానిపై నేను స్పష్టతతో ఉన్నా. ఆరుగురు స్టార్లు ఉన్న మా జట్టుకు జమ్మూకశ్మీర్ చేతిలో ఓటమి ఎదురైంది. అది చాలా నిరుత్సాహానికి గురి చేసింది. అందుకే, సూర్యకుమార్, దూబెకు సలహా ఇస్తున్నా. ఏదో రంజీల్లో ఆడాలి కాబట్టే బరిలోకి దిగుతున్నామని కాకుండా.. నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాలని కోరుతున్నా. ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి. గత మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ల కోసం కుర్రాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. అయినా విజయం సాధించలేకపోయాం. ముంబయి కోసం బరిలోకి దిగిన ప్రతిసారీ వందశాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సంజయ్ పాటిల్ వెల్లడించారు.