ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : శంకర్‌రావు

హైదరాబాద్‌,ఆగస్టు 14 (జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినీయర్‌ నేత పి.శంకర్‌రావు మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి మంత్రులతో ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ దిగజారుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానానికి లేఖ వ్రాసినట్టు శంకర్‌రావు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించి, పార్టీ రుణం తీర్చుకోవాలని శంకర్‌రావు డిమాండ్‌ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎర్రచందనం, స్మగ్లింగ్‌లో ముఖ్యమంత్రిపై అభియోగాలు ఉన్నాయని వాటిని దృష్టిలోఉంచుకొని ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి తనపదవికి రాజీనామా చేయాలని శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఆశించేవారే ఉండరని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయం చేయడం సరికాదని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరు తక్షణం తమ పదవుల నుండి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా సిబిఐ జారీ చేసిన చార్జీషీట్‌కు నైతిక బాధ్యత వహించి మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు తన పదవికి రాజీనామా చేయాలని శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రమంత్రి వర్గంలో ఒక అవినీతి వికెట్టు పోయిందని మరో 6వికెట్లు ఉన్నాయని అన్నారు. పార్టీకి నష్ట కలిగించే విధంగా ఎవ్వరూ వ్యవహరించవద్దని అన్నారు. అవినీతి మంత్రుల భరతం పడతాననే ఉద్దేశ్యంతో తనను మంత్రి పదవినుండి తొలగించారని శంకర్‌రావు ఆరోపించారు. నెహ్రూ, గాంధీ కుటుంబాలకు ఉన్న ఓటుబ్యాంకుకు అవినీతి మంత్రుల ద్వారా గండి పడుతుందని శంకర్‌రావు అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయం చేయడమంటే జగన్‌ను నిర్దోషి అని చెప్పడమేనని శంకర్‌రావు అన్నారు.